రైతులు, దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటేనే ఒక దేశం అభివృద్ధి పథంగా పయనిస్తూ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సైతం రకరకాల పధకాలు అమలు చేస్తూ రైతులకు, ప్రజలకు అండగా నిలుస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పధకాలను అమలు చేస్తూ ఉంటుంది.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం కిసాన్ స్కీం ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని పూర్తి పేరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం.
అయితే.. ఈ పధకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది. అయితే ఈ డబ్బు ఒకేసారి జమ అవదు. విడతల వారీగా ఈ డబ్బు జమ అవుతూ వస్తుంది. ఏడాదికి మూడు విడతల చొప్పున డబ్బుని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పధకం కింద రైతులకు పది విడతలుగా డబ్బు జమ అయింది. అనగా.. ఇరవై వేల వరకు రైతుల ఖాతాకు అందింది.
ఇక 11 వ విడతకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో డబ్బులు పడే అవకాశం ఉంది. అయితే ఈ స్కీం లో కొన్ని షరతులు ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీం కింద డబ్బు అందుతుంది. అంటే భార్యకి గాని, భర్తకి గాని ఎవరో ఒకరికే ఈ స్కీం వర్తిస్తుంది. ఒకవేళ ఇద్దరు తీసుకుంటూ ఉంటె డబ్బు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందట.
ప్రస్తుతం ఇలా ఎవరెవరు తీసుకుంటున్నారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా ఒకే ఇంట్లో ఇద్దరు తీసుకుంటుంటే.. వెనక్కి ఇచ్చేయడం మంచిది. లేదంటే కేసు నమోదు అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు కొందరు అర్హత లేకున్నా ఈ పధకం కింద లబ్ది పొందుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం సవరణలు చేపట్టింది.






























