ఎన్నో ఇబ్బందులను, సమస్యలను అధిగమించి ఎట్టకేలకు ఐపీఎల్ మళ్ళీ మొదలయ్యింది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ లో నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. అయితే, ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని ఒక సంఘటన ఐపీఎల్ లో చోటు చేసుకోబోతోంది. అక్టోబర్ 8వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. శుక్రవారం సాయంత్రం 7 :30 నిమిషాలకు అబుదాబిలో ఈ మ్యాచ్ జరగబోతోంది.
అదే రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చిట్ట చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ కూడా అదే సమయానికి ఉండటం గమనార్హం. మామూలుగా అయితే ఒకే రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటే, మధ్యాహ్నం ఒక మ్యాచ్, సాయంత్రం ఒక మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం 2 మ్యాచ్‌లు సమయానికి మొదలవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇది వరకు ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం చూస్తే, అక్టోబర్ 8వ తేదీన, మధ్యాహ్నం 3 : 30 నిమిషాలకు మొదలవ్వాల్సి ఉంది.
కానీ ఇప్పుడు బోర్డ్ ఆ సమయాన్ని కొంచెం వెనక్కి జరిపి 07:30 నిమిషాలకు నిర్వహించేలా సవరణలు చేసింది. ఒకేరోజు ఒకటే సమయానికి రెండు మ్యాచ్‌లు చూడాల్సిరావడంతో, ప్రేక్షకులు ఏ మ్యాచ్ చూడాలి అనే ఆలోచనలో పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఐపీఎల్లో జరగలేదు ఈ సవరణలు చేయడానికి కారణం 2023 -2027 మధ్య జరిగే ఐపీఎల్ టోర్నమెంట్‌కి సంబంధించిన మీడియా హక్కుల టెండర్లు, రెండు కొత్త ఐపీఎల్ జట్ల ప్రకటన కోసం బీసీసీఐ కీలక సమావేశాన్ని అదే రోజు నిర్వహించాల్సి ఉంది. ఈ కారణంచేత షెడ్యూల్లో మార్పులు చేసినట్లు సమాచారం.