త్రేతాయుగంలో శ్రీరాముని దర్శనం కోసం శబరి జీవితాంతం వరకు భక్తితో ఎదురు చూసి, ఆఖరికి రామ దర్శనం చేసుకుని తన జన్మ ధన్యం చేసుకుంది. ఈ కలియుగంలో సైతం అలాంటి భక్తి ఉన్న వ్యక్తి ఉందంటే ఆశ్చర్యపడకుండా ఉండలేరు.
ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 85 ఏళ్ల భక్తురాలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని గత ముప్పై సంవత్సరాలుగా మౌన వ్రతం పాటిస్తోంది. కొద్దిరోజుల్లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో ఆమె మౌన వ్రతాన్ని వీడనుంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా, కరమ్తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.
Also Read: బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?