ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో హిట్స్ సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు అనుష్క. బాహుబలి తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు. భాగమతి చేసిన కొన్ని సంవత్సరాలకి నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి.
- నిర్మాత : వంశీ, ప్రమోద్
- దర్శకత్వం : మహేష్ బాబు పి
- సంగీతం : రధన్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 7, 2023
స్టోరీ :
అన్విత రవళి శెట్టి (అనుష్క శెట్టి) లండన్ లో షెఫ్ గా పని చేస్తూ ఉంటుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అన్విత ఇండియా వచ్చేస్తుంది. అన్విత తల్లి (జయసుధ) పెళ్లి జీవితం సాఫీగా సాగదు. అది చూసిన అన్విత తాను పెళ్లి చేసుకోవద్దు అని డిసైడ్ అవుతుంది. కానీ అన్విత తల్లి చనిపోవడంతో తనకి ఒక బిడ్డ కావాలి అనుకుంటుంది. అది కూడా పెళ్లి కాకుండానే మెడికల్ పద్ధతుల సహాయం తీసుకుని ఒక బిడ్డని కనాలి అనుకుంటుంది. దాని కోసం ఒక అబ్బాయిని అన్విత వెతుకుతూ ఉంటుంది. సిద్దు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) ఒక స్టాండ్ అప్ కమెడియన్.
కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ పార్ట్ టైం గా స్టాండ్ అప్ కమెడియన్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి తను పని చేసే హోటల్ లో సిద్ధుని చూసిన అన్విత పిల్లలు కనడానికి డాక్టర్ (హర్షవర్ధన్) కి సిద్ధు పేరుని రిఫర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్దు దీనికి ఒప్పుకున్నాడా? అన్విత సిద్దుని ఇష్టపడిందా? వారిద్దరూ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత కొద్ది సంవత్సరాల నుండి అనుష్క సీరియస్ సినిమాలు, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అనుష్కని ఒక కామెడీ సినిమాలో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఖలేజా సినిమాలో అనుష్క కామెడీ షేడ్స్ ఉన్న ఒక పాత్రను పోషించారు. సైజ్ జీరో సినిమాలో కూడా కొంత వరకు కామెడీ చేశారు. కానీ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమా మాత్రం అనుష్క నుండి రాలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చింది అని చెప్పాలి. జాతి రత్నాలు సినిమాతో మంచి కామెడీ టైమింగ్ ఉంది అని నిరూపించుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి.
ఈ సినిమాలో మరొక వైవిధ్యమైన పాత్రతో మన ముందుకి వచ్చారు. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫ్లాట్ గా నడుస్తుంది. హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవ్వడం, ఆమె లైఫ్, ఆ తర్వాత హీరోని చూపించడం, తర్వాత వాళ్లిద్దరూ కలవడం ఇలా రొటీన్ దారిలోనే సినిమా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఏదైనా సేవింగ్ గ్రేస్ ఉంది అంటే అది నవీన్ పోలిశెట్టి మాత్రమే. చాలా న్యాచురల్ గా నటించారు. అలా అని ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకి బోర్ కొట్టదు.
అలా నడుస్తుంది అంతే. సినిమా కథ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎదుర్కొనే సంఘటనలు ఏంటి? ప్రేమ, పెళ్లి పట్ల వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? కెరీర్ గురించి వారు ఎలాంటి కలలు కొంటారు? ఆ కలల్ని నిజం చేసుకోవడానికి వారు పడే కష్టాలు ఏంటి? ఒక డిఫరెంట్ కెరీర్ ఎంచుకున్నప్పుడు తల్లిదండ్రుల నుండి వచ్చే వ్యతిరేకతని ఎలా ఎదుర్కొంటారు? వాటన్నిటిని దాటి ఎలా ముందుకు వెళ్తారు? ఇవన్నీ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
అంతే కాకుండా హీరో హీరోయిన్ కి మధ్య 6 సంవత్సరాలు తేడా అని చూపించారు. హీరోయిన్ హీరో కంటే పెద్దది అని చూపించే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా ఆ విషయంలో మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని తెరపై చూపించడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. మంచి నటీనటులు ఉంటే మంచి అవుట్ పుట్ వస్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుష్కకి మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి రోల్ దొరికింది.
ముందు చేసిన పాత్రలతో పోలిస్తే ఈ పాత్ర చాలా భిన్నంగా అనిపిస్తుంది. అనుష్క ఈ పాత్రలో చాలా బాగా నటించారు. నవీన్ పోలిశెట్టిని అయితే మరొక న్యాచురల్ స్టార్ అనొచ్చు ఏమో. ఈ పాత్ర తనకి ఒక టైలర్ మేడ్ పాత్ర లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా తన భుజాలపై నడిపించారు. సహాయ పాత్రల్లో నటించిన జయసుధ, హ్యాపీ డేస్ సోనియా, తులసి, మురళీ శర్మ వీరందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.
కానీ కొన్ని చోట్ల మాత్రం ట్రైలర్ లో చూపించినట్టుగానే అనుష్కని కాస్త యంగ్ గా చూపించే ప్రయత్నం చేశారు. టెక్నాలజీ పుణ్యమా అని ఈ ఫిల్టర్స్ ఇప్పుడు ప్రేక్షకులకు తెలుసు. అందుకే అనుష్క కనిపించిన సీన్స్ లో ఉన్న వ్యత్యాసం ప్రేక్షకులకు ఈజీగా అర్థం అయిపోతుంది. అంతే కాకుండా కొన్ని సీన్స్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి. దాంతో ఎమోషన్ లో ఉన్న లోతు అనేది కాస్త తగ్గుతుంది. ఈ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ఫ్రెష్ కాన్సెప్ట్
- కామెడీ
- హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్
- చాలా మంది కనెక్ట్ అయ్యే విషయాలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ గా సాగిపోయే ఫస్ట్ హాఫ్
- సాగదీసినట్టుగా ఉండే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
ఒక మంచి క్లీన్ ఎంటర్టైనర్. కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా. కొన్ని లోపాలు ఉన్నా కూడా మంచి కామెడీ, డిఫరెంట్ కథనం, మంచి నటీనటులతో పాటు, ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో సార్లు చూసి ఉంటారు… కానీ ఈ పొరపాటు గమనించారా..?