ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ప్రేమలో పడటం ఆ తర్వాత ఇంట్లో వాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. లేదు అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం లాంటివి చేస్తున్నారు. తరచూ మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా అస్సలు పట్టించుకోవడం లేదు ఈ కాలం పిల్లలు. అయితే ఇదే పరిస్థితి ఒక తండ్రికి వచ్చింది.
తన కూతురు ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి కుంగిపోయాడు. దీనితో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తనకి ఇష్టం లేని పెళ్లి కూతురు చేసుకోవడంతో కోపం వచ్చి ఆమె బతికుండగానే పిండం పెట్టాడు తండ్రి. పైగా గుండు కూడా కొట్టించుకుని దిన కర్మలు కూడా చేశాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలం, మద్దూరు గ్రామానికి చెందిన భార్గవికి అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే ఒక యువకుడు పరిచయం అయ్యాడు.
ఆ తరవాత వీళ్ళ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే జీవితాంతం కలిసి ఉండాలని వీళ్ళు అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుని పెద్దలని అడిగే సరికి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే వీళ్ళ ప్రేమని నెగ్గించుకోవాలనుకుని.. పెద్దల్ని ఎదిరించి ఈనెల 13 న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే వద్దన్న వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తండ్రి గుండు గీయించుకుని కూతురికి కర్మకాండలు చేశాడు.
ఆమె ఫోటో కి పూల దండ వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. తనకు విలువ లేనందుకు కోపంతో తండ్రి ఆమెకి పిండ ప్రదానం చేస్తున్నాడంటూ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.